చంద్రయాన్ సులభమే కానీ 'రాహుల్ యాన్' సాధ్యం కాదు: కాంగ్రెస్ పై రాజ్ నాథ్ సింగ్ వ్యంగ్యం

  • రాజస్థాన్ లోని జైసల్మేర్ లో బీజేపీ పరివర్తన్ యాత్ర
  • హాజరైన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
  • రాహుల్ యాన్ లాంచ్ కాదు, ల్యాండ్ కాదు అంటూ ఎద్దేవా
  • సనాతన ధర్మంపై కాంగ్రెస్ అగ్రనేతల వైఖరి వెల్లడించాలని డిమాండ్
రాజస్థాన్ లోని జైసల్మేర్ లో బీజేపీ నిర్వహించిన పరివర్తన్ యాత్రలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

చంద్రయాన్ విజయవంతం చేశాం కానీ, రాహుల్ యాన్ సాధ్యం కాని పని అని వ్యంగ్యం ప్రదర్శించారు. రాహుల్ ను ప్రధాని చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలను ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ యాన్ లాంచ్ కావడం కుదరదు, ల్యాండవడం అంతకన్నా కుదరదు అని వ్యాఖ్యానించారు. 

ఇక, సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపైనా రాజ్ నాథ్ స్పందించారు. డీఎంకే సనాతన ధర్మాన్ని విమర్శిస్తే, కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ అభిప్రాయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సనాతన ధర్మంపై ఇండియా కూటమి నేతలు విమర్శించారని, వారు క్షమాపణలు చెప్పాల్సిందేనని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. లేకపోతే, దేశ ప్రజలు వారిని క్షమించబోరని అన్నారు. హిందూ-ముస్లిం అంశం నుంచి లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుందని ఆరోపించారు.


More Telugu News