వర్షాల కోసం దేవుడిని ప్రార్థించాలన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
- ఆగస్ట్ లో వర్షాలే లేవన్న మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
- రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్య
- పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆవేదన
నైరుతి రుతుపవనాల మందగమనంతో పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కరవు పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సంక్షోభం కూడా నెలకొంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేశారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని భగవంతుడిని ప్రార్థించాలని ప్రజలకు సూచించారు. ఆగస్టు నెలలో వర్షాల జాడే లేదని అన్నారు. దీంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, పంటలు కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొందని చెప్పారు. వర్షాలు కురవాలని, పంటలను కాపాడాలని ప్రార్థిస్తూ తాను ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలు, నగరాల్లో ఉన్న ప్రజలు వారి సంప్రదాయాల ప్రకారం దేవుళ్లను ప్రార్థించాలని సూచించారు. పూర్తి విశ్వాసంతో పూజలు చేస్తే దేవుడు కరుణిస్తాడని చెప్పారు.