ప్రమాదమే ప్రాణాలను నిలబెట్టింది.. బస్సును ఢీ కొట్టిన లారీ

  • నరసరావుపేటలో ఆర్టీసీ ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
  • ట్రాన్స్ పోర్ట్ లారీ రూపంలో దేవుడే కాపాడాడంటున్న ప్యాసింజర్లు
  • బస్సు బ్రేకులు ఫెయిల్.. లారీ ఢీ కొట్టడంతో ఆగిన బస్సు
సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో మనుషులు చనిపోవడం చూస్తూనే ఉంటాం.. కానీ ఆదివారం జరిగిన ఓ ప్రమాదం మాత్రం చాలామంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడడానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు..

శ్రీశైలం నుంచి మునుగోడు వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. పెట్లూరి వారి పాలెం వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలైన విషయాన్ని డ్రైవర్ గుర్తించాడు. దీంతో ప్రమాదం తప్పదని బస్సులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. బస్సును ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అదే సమయంలో నరసరావుపేట నుంచి వస్తున్న నవత ట్రాన్స్ పోర్ట్ లారీ ఈ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది.

లారీ ఢీ కొట్టకుంటే బస్సు వేగంగా దూసుకెళ్లి ఏ చెట్టును ఢీ కొట్టినా భారీ ప్రమాదమే జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్పారు. ట్రాన్స్ పోర్ట్ లారీ రూపంలో భగవంతుడే తమను కాపాడాడని అంటున్నారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం కొంత దెబ్బతినడం మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.


More Telugu News