ఢిల్లీలో జరిగే జీ20 సదస్సుకు 1.30 లక్షల మందితో భారీ భద్రత

  • ఈ నెల 9, 10 తేదీల్లో జీ 20 సదస్సు
  • సదస్సుకు హాజరుకానున్న అగ్ర దేశాధినేతలు
  • భద్రతా విధుల్లో ఎయిర్ పోర్స్, ఆర్మీ
ఈ నెల 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ  సదస్సుకు కనీవినీ ఎరుగని రీతిలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక లక్ష 30 వేల మంది భద్రతా సిబ్బంది విధులను నిర్వహించబోతున్నారు. వీరిలో 80 వేల మంది ఢిల్లీ పోలీసులు కాగా మిగిలిన వారు కేంద్ర భద్రతా బలగాలకు చెందినవారు. వీరిలో 45 వేల మంది ఖాకీ దుస్తులు కాకుండా ప్రత్యేకంగా నీలి దుస్తులు ధరిస్తారు. వీరిలో కమెండోలు కూడా ఉంటారు. ఈ కమెండోలు హెలికాప్టర్ నుంచి అత్యంత వేగంగా కిందకు దిగే సామర్థ్యం కలిగినవారు. 

మరోవైపు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గగనతల రక్షణ విధులను భారత వాయు సేన చేపట్టింది. గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను భారత సైన్యం ఏర్పాటు చేసింది. 400 మంది అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రూ. 18 కోట్లతో 20 బుల్లెట్ ప్రూఫ్ కార్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. మరోవైపు ఈ సమావేశానికి హాజరయ్యే ప్రముఖ నేతల్లో అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలు ఉన్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు బదులుగా ఆ దేశ విదేశాంగ మంత్రి హాజరుకానున్నారు.



More Telugu News