మేకను ఎత్తుకుపోయాడని ఆరోపిస్తూ తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు

  • మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • ఓ కుటుంబం వద్ద పశువుల కాపరిగా ఉన్న యువకుడు
  • ఇటీవల మంద నుంచి కనిపించకుండా పోయిన మేక
  • ఇద్దరినీ తమ వద్దకు పిలిపించుకుని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు
  • విషయం బయటకు రావడంతో యజమాని కుటుంబంపై అట్రాసిటీ కేసు నమోదు
తాము పనిలోపెట్టుకున్న కుర్రాడు మేకను ఎత్తుకుపోయాడనే అనుమానంతో అతడిని, అతడి స్నేహితుడిని ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతడి భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్ అంగడిబజార్‌ ప్రాంతంలో ఉంటున్నారు. వీరు పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి మేకలను పెంచుతున్నారు. తేజ(19) అనే యువకుడు వీరి ఇంట్లోనే ఉంటూ పశువుల కాపరిగా చేస్తున్నాడు. అతడి తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. తండ్రి లేడు. 

సుమారు 20 రోజుల క్రితం ఓ మేక, ఇనుప రాడ్డు కనిపించకుండా పోయింది. తేజతోపాటు అతడి దళిత స్నేహితుడు చిలుముల కిరణ్‌(30)పై యజమాని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆ ఇద్దరినీ శుక్రవారం షెడ్డుకు పిలిపించారు. ఆ తరువాత వారిని కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీశారు. ఆపై తల కింద నేలపై నిప్పు పెట్టి చిత్ర హింసలకు గురిచేశారు. పొగతో ఊపిరాడక వారు నానా యాతన అనుభవించారు. ఆ తరువాత వారిద్దరినీ విడిచిపెట్టారు. 

రామగుండానికి చెందిన కిరణ్‌కు తల్లిదండ్రులు లేరు. అతడు మందమర్రిలో తన చిన్నమ్మ సరిత వద్ద ఉంటూ నిర్మాణ కార్మికుడిగా పొట్టపోసుకుంటున్నాడు. శుక్రవారం బయటకు వెళ్లిన కిరణ్ ఎంతకీ రాకపోవడంతో సరిత తీవ్ర ఆందోళనకు లోనైంది. ఇదే సమయంలో, అతడిని చిత్రహింసలకు గురి చేసిన ఫొటోలను చూసి భయపడిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు రాములు, ఇతర కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించారు.


More Telugu News