ముందుగా వస్తున్న రవితేజ ‘టైగర్’.. బాక్సాఫీస్ వద్ద ‘సలార్‌‌’తో ఫైట్

  • వచ్చే నెల 20న విడుదల కావాల్సిన టైగర్ నాగేశ్వరరావు 
  • ఈ నెల 28నే విడుదల చేస్తున్నట్టు కొత్త తేదీ ప్రకటన
  • అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా సలార్ విడుదల
ఈ ఏడాది ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య', 'రావణాసుర' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో అభిమానులను ఆకట్టుకోనున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో నుపుర్ సనన్ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, రేణు దేశాయ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. 

జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ముందుగా ఐదు భాషల్లో అక్టోబర్ 20వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కానీ, ఈ సినిమా అంతకంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 28వ తేదీనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ను కూడా షేర్ చేశారు. వచ్చే నెల 19న రానున్న విజయ్ జోసెఫ్ ప్యాన్ ఇండియా చిత్రం ‘లియో’, బాలయ్య ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో క్లాష్ అవ్వకుండా రవితేజ సినిమాను ముందుకు జరిపినట్టు తెలుస్తోంది. కానీ, ఈనెల 28న మరో పాన్ ఇండియా చిత్రం ప్రభాస్ నటించిన ‘సలార్’ విడుదల కానుంది. ఈ లెక్కన  బాక్సాఫీస్ వద్ద ప్రభాస్‌తో పోటీకి రవితేజ సిద్ధమయ్యారనొచ్చు.


More Telugu News