తుమ్మల ఇంటికి పొంగులేటి.. కేసీఆర్ పై విమర్శలు!

  • తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన పొంగులేటి
  • తుమ్మలకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని వ్యాఖ్య
  • వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ పద్ధతి ఉందని విమర్శ
సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఆయన ఇంటికి పొంగులేటి వెళ్లారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ... ఏ పార్టీలో ఉన్నా తుమ్మల ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తారని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ఇప్పటికే తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారని... తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్, బీఆర్ఎస్ పద్ధతి ఉందని విమర్శించారు. పొమ్మనకుండా పొగపెడతారని దుయ్యబట్టారు. తనకు చేసిన విధంగానే తుమ్మలను కూడా అవమానాలకు గురి చేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తాను తన అనుచరులు, మద్దతుడారులతో చర్చించానని... వారందరి సూచనల మేరకే కాంగ్రెస్ లో చేరానని పొంగులేటి చెప్పారు. తుమ్మల కూడా వారి అనుచరులతో మాట్లాడి, ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు.


More Telugu News