జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్!

  • కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్
  • ముంబై కార్యాలయంలో సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ
  • నేడు గోయల్‌ను పీఎమ్ఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ, కస్టడీ కోరే అవకాశం
కెనరా బ్యాంకును మోసగించిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబైలోని ఈడీ ఆఫీసులో గోయల్‌ను సుదీర్ఘంగా విచారించిన అధికారులు చివరకు ఆయనను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. శనివారం అధికారులు ఆయనను నగరంలోని పీఎమ్ఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గోయల్ కస్టోడియల్ రిమాండ్‌ను ఈడీ కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

తాము రుణంగా ఇచ్చిన రూ.538 కోట్ల నిధులను దారిమళ్లించారంటూ గతంలో కెనరా బ్యాంకు గోయల్, ఆయన భార్య అనిత, ఇతర కంపెనీ ఉన్నతాధికారులపై ఫ్రాడ్ కేసు దాఖలు చేసింది. జెట్ ఏయిర్ వేస్ సంస్థకు గతంలో రూ.848.86 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్టు పేర్కొంది. ఆ తరువాత కంపెనీ ఆర్థిక లావాదేవీలపై జరిపిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో పలు అవకతవకలు బయటపడ్డాయని కెనరా బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది. 

జెట్ ఎయిర్‌వేస్ సంబంధిత కంపెనీల్లోకి రూ.1410.41 కోట్ల నిధులు బదిలీ అయ్యాయని, వాటిల్లో సంస్థకు జారీ అయిన రుణ మొత్తం కూడా ఉందని కెనరా బ్యాంకు ఆరోపించింది. గోయల్ తన వ్యక్తిగత సిబ్బంది శాలరీలు, తన కుటుంబ ప్రయాణ ఖర్చులు కూడా జెయిట్ ఎయిర్ వేస్ రుణంలోంచే చెల్లించినట్టు పేర్కొంది. జెట్ లైట్ లిమిటెడ్ అనే మరో సంస్థ ద్వారా పెట్టుబడులు, అడ్వాన్సులు జారీ చేసి రుణ నిధులు మళ్లించిన విషయాన్నీ పేర్కొంది. వీటిల్లో కొన్ని కేటాయింపులను రకరకాల నిబంధనల పేరిట రద్దయిపోయినట్టు ప్రకటించారని తెలిపింది.


More Telugu News