టార్గెట్ గుడివాడ... గెలిచి తీరాల్సిందేన్న చంద్రబాబు

  • అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు సమీక్ష
  • త్వరలోనే గుడివాడ అభ్యర్థిని ఖరారు చేస్తానని వెల్లడి
  • పార్టీ కోసం కష్టపడే వ్యక్తికి గుడివాడ టికెట్ ఇస్తామని స్పష్టీకరణ
  • గ్రూపులు కడితే సహించబోనని పార్టీ నేతలకు హెచ్చరిక
టీడీపీ అధినేత చంద్రబాబు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య సమన్వయం కుదర్చడంపై దృష్టి సారించారు. అనకాపల్లి, కైకలూరు, యలమంచిలి, కందుకూరు, గుంతకల్లు నియోజకవర్గాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. 

గుడివాడ టీడీపీ నేతలతోనూ చంద్రబాబు సమావేశం అయ్యారు. గుడివాడలో గెలుపే టీడీపీ టార్గెట్ అని స్పష్టం చేశారు. త్వరలోనే గుడివాడ అభ్యర్థిని ఖరారు చేస్తామని, పార్టీ కోసం కష్టపడే వ్యక్తినే ఎంపిక చేస్తామని చెప్పారు. గుడివాడలో విజయం కోసం పార్టీ నేతలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం ఎవరెంత కష్టపడుతున్నారో తన వద్ద నివేదిక ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అటు, అనకాపల్లి నియోజకవర్గ పరిస్థితులపై ఆగ్రహం వెలిబుచ్చారు. నేతల తీరు ఇలాగే ఉంటే తాను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు వర్గాలు సఖ్యతతో ముందుకు పోవాలని స్పష్టం చేశారు. గ్రూపులు కడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని తెగేసి చెప్పారు. 

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ నేతల మధ్య అభిప్రాయభేదాలను కూడా చంద్రబాబు పరిష్కరించారు. గుంతకల్లు నియోజకవర్గ ఇన్చార్జి జితేందర్ గౌడ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెరుగ్గా  పనిచేయాలని స్పష్టం చేశారు.


More Telugu News