మాజీ ప్రధాని దేవెగౌడ మనవడిపై అనర్హత వేటు వేసిన కర్ణాటక హైకోర్టు

  • గత ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ఎంపీగా గెలిచిన ప్రజ్వల్ రేవణ్ణ
  • అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారంటూ పిటిషన్లు
  • రేవణ్ణ తప్పిదానికి పాల్పడినట్టు నిర్ధారించిన కోర్టు
  • ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పు
  • ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటన
మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు, జనతాదళ్ (సెక్యులర్) నేత ప్రజ్వల్ రేవణ్ణ గత ఎన్నికల్లో కర్ణాటకలోని హసన్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే, రేవణ్ణ తన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ కర్ణాటక హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని ఇవాళ తీర్పు ఇచ్చింది. అంతేకాదు, వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 

ప్రజ్వల్ రేవణ్ణ వయసు 33 సంవత్సరాలు. పార్లమెంటులో అత్యంత పిన్నవయసు ఎంపీల్లో అతడు మూడోవాడు. రేవణ్ణ తప్పుడు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేశారంటూ... 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంజు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై హసన్ నియోజకవర్గ పౌరుడు దేవరాజగౌడ కూడా పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.


More Telugu News