జమిలి ఎన్నికలకు జై కొట్టనున్న కేంద్రం.. మాజీ రాష్ట్రపతి కోవింద్ కు కీలక బాధ్యతలు

  • ‘ఒక దేశం - ఒకే ఎన్నిక’ కోసం ప్యానెల్ ఏర్పాటు
  • కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సారథ్యం
  • పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం
దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీని ఈసారి ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. దేశంలోని 28 పార్టీలు ఏకమై ‘ఇండియా కూటమి‘గా ఏర్పడ్డాయి. తమ కార్యాచరణ ప్రకటించడం కోసం కూటమి మూడుసార్లు సమావేశమైంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘జమిలి’ ఎన్నికలతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని నిన్న నిర్ణయించింది. ఈ రోజు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. 

‘ఒక దేశం - ఒకే ఎన్నిక‘ పేరుతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్ర భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కోవింద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో ఒకేసారి లోక్ సభ, అయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణపై సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీలో 16 మందితో సభ్యులు ఉంటారని తెలుస్తోంది. కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.


More Telugu News