భార్య కోసం హైదరాబాద్ వచ్చేసిన పాకిస్థానీ.. 9 నెలలుగా నగరంలోనే మకాం

భార్య కోసం హైదరాబాద్ వచ్చేసిన పాకిస్థానీ.. 9 నెలలుగా నగరంలోనే మకాం
  • షార్జాలో పాకిస్థానీ యువకుడు అహ్మద్ ఫయాజ్, హైదరాబాదీ యువతి ఫాతిమా మధ్య ప్రేమ
  • 2019లో షార్జాలోనే వారి వివాహం, ఓ బిడ్డ పుట్టిన వైనం
  • ఆ తరువాత ఎవరిదారిన వారు వెళ్లిపోయిన భార్యాభర్తలు
  • తన కుమారుడితో పాటూ తల్లిదండ్రుల వద్ద నగరంలోనే ఉంటున్న ఫాతిమా
  • పాకిస్థానీ అల్లుడిని ఇండియాకు పిలిపించుకున్న ఫాతిమా తల్లిదండ్రులు
  • అతడికి ఆధార్ కార్డు తెచ్చే ప్రయత్నంలో ఉండగా విషయం బట్టబయలు
  • స్థానికుల సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాదీ యువతిని విదేశాల్లో పెళ్లాడిన ఓ పాకిస్థానీ యువకుడు భార్య కోసం అక్రమంగా దేశంలో కాలుపెట్టాడు. 9 నెలలుగా హైదరాబాద్‌లో ఇల్లరికపు అల్లుడిగా మకాం పెట్టాడు. అక్రమంగా ఆధార్ కార్డు సంపాదించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు. దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్య తెలిపిన వివరాల ప్రకారం, పాక్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన ఫయాజ్ అహ్మద్(24) 2018లో ఉపాధి కోసం షార్జా వెళ్లాడు. అక్కడే ఓ వస్త్ర పరిశ్రమలో పనికి కుదురుకున్నాడు. ఇక హైదరాబాద్‌ బహదూర్‌పురాకు చెందిన నేహా ఫాతిమా(29) కూడా ఉపాధి నిమిత్తం షార్జా వెళ్లింది. అక్కడ ఫయాజ్ సాయంతో ఉద్యోగం సంపాదించింది. అలా మొదలైన వారి పరిచయం చివరకు ప్రేమగా మారడంతో వారు 2019లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. ఆ తరవాత ఫయాజ్ పాకిస్థాన్ వెళ్లగా, నేహ ఫాతిమా నగరానికి వచ్చేసింది. 

ఈ క్రమంలో ఫాతిమా తల్లిదండ్రులు పాకిస్థాన్‌లోని ఫయాజ్ ను కొంత కాలం క్రితం సంప్రదించారు. ఇండియా వచ్చేయాలని, ఇక్కడే ఉండేందుకు కావాల్సిన గుర్తింపు పత్రాలు తాము ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో, ఫయాజ్ గతేడాది నవంబర్‌లో పాకిస్థాన్ నుంచి నేపాల్ వెళ్లాడు. అక్కడే ఫయాజ్‌ను ఫాతిమా తల్లిదండ్రులు కలుసుకున్నారు. మరికొందరి సాయంతో అతడిని నగరానికి తీసుకొచ్చారు. కిషన్‌బాగ్‌లో నివాసం ఏర్పాటు చేసి కాపురం పెట్టించారు. 

అతడికి ఆధార్ కార్డు ఇప్పించి స్థానికుడిలా చెలామణీ చేసేందుకు ప్రయత్నించారు. మాదాపూర్‌లోని ఓ ఆధార్ కేంద్రానికి వెళ్లి ఫయాజ్‌ను తమ కుమారుడు మహ్మద్ గౌస్‌గా పరిచయం చేసి ఆధార్ కార్డు పొందేందుకు ట్రై చేశారు. ఈ మేరకు నకిలీ జనన ధ్రువపత్రాన్ని కూడా ఇచ్చారు. అయితే, స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు నిందితుడు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి పాకిస్థానీ పాస్‌పోర్టు గడువు కూడా ముగిసినట్టు గుర్తించారు. మరోవైపు, ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్, అఫ్జల్ బేగం మాత్రం పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో కుట్రకోణం ఏమైనా ఉందా? అనేది తెలుసుకునేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. 


More Telugu News