అదానీ గ్రూప్ లో ఏదో జరుగుతోంది... ఆ డబ్బు ఎవరిదో తెలియాలి: రాహుల్ గాంధీ

  • అదానీ గ్రూప్ అక్రమాలపై మీడియాలో కథనాలు వచ్చాయన్న రాహుల్ 
  • బిలియన్ డాలర్ల డబ్బు భారత్ నుంచి తరలి వెళ్లి, వివిధ మార్గాల్లో మళ్లీ వచ్చిందని వెల్లడి
  • ఆ డబ్బు అదానీదేనా, లేక ఇతరులదా అంటూ ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేత
  • ఈ కుంభకోణంపై విచారణ ఎందుకు జరిపించరంటూ ఆగ్రహం
అదానీ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. అదానీ గ్రూప్ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చాయని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న పత్రికల్లో ఈ కథనాలు వచ్చాయని వివరించారు. బిలియన్ డాలర్ల ధనం భారత్ నుంచి తరలి వెళ్లింది... వివిధ మార్గాల్లో ఆ డబ్బు మళ్లీ తిరిగివచ్చిందని కథనాల్లో పేర్కొన్నారని రాహుల్ తెలిపారు. ఆ డబ్బు ఎవరిది... అదానీదేనా... లేక ఇతరులదా? అని ప్రశ్నించారు. 

పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారని, షేర్ల పెరుగుదల సొమ్ముతో అదానీ పోర్టులు, ఎయిర్ పోర్టుల వంటి ఎన్నో ఆస్తులు కొన్నారని ఆరోపించారు. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ అక్రమాల మాస్టర్ మైండ్ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  నాసర్ అలీ, ఛాంగ్ చుంగ్ లింగ్ దీని వెనుక ఉన్నట్టు కథనాలు వచ్చాయని అన్నారు.

గతంలో వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్ నకు సెబీ క్లీన్ చిట్ ఇచ్చిందని, అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎన్డీటీవీలో డైరెక్టర్ గా ఉన్నాడని వెల్లడించారు. 

"అదానీ గ్రూప్ లో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. భారతదేశానిది పారదర్శక ఆర్థిక వ్యవస్థ అని ప్రపంచానికి చెబుతున్నాం. మరి ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరిపించరు? అదానీ గ్రూప్ అంశంపై జేపీసీ విచారణకు ఎందుకు అనుమతించరు? విచారణ కోసం ప్రధాని ఎందుకు చొరవ తీసుకోవడంలేదు? కుంభకోణాలకు పాల్పడేవారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"మరి కొన్నిరోజుల్లో ఢిల్లీలో జీ-20 సమావేశం జరగబోతోంది. జీ-20 సదస్సులో అదానీ గ్రూప్ అంశంపై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? అదానీ గ్రూప్ ఎందుకు అంత ప్రత్యేక సంస్థగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థపై స్వారీ చేసేందుకు అదానీ గ్రూప్ ను ప్రధాని ఎందుకు అనుమతిస్తున్నారు?" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.


More Telugu News