ఐదేళ్లు జిల్లాను చేతిలో పెడితే ఏం చేశాడు?.. తుమ్మలపై కందాల ఘాటు వ్యాఖ్యలు!

  • బీఆర్ఎస్‌లో తుమ్మలకు జరిగిన అన్యాయం ఏంటన్న కందాల ఉపేందర్ రెడ్డి
  • షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతారని ప్రశ్న
  • ఆమెకు ఖమ్మం జిల్లాతో ఏం సంబంధమని నిలదీత
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్సార్‌‌టీపీ చీఫ్ షర్మిలపై పాలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లో తుమ్మలకు జరిగిన అన్యాయం ఏంటని ప్రశ్నించారు. ‘‘2014లో ఓడిపోయిన తుమ్మలను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం అన్యాయమా? ఐదేళ్లు జిల్లాను అప్పజెబితే 2018లో ఒక్క సీటునూ గెలవలేదు. ఆయనా గెలవలేకపోయారు. తుమ్మలకు జిల్లాలో పట్టు ఉంటే ఎందుకు గెలిపించుకోలేదు?” అని ప్రశ్నించారు. కొందరు రాజకీయాల్లో ఫైటర్స్‌గా ఉంటారని, మరికొందరిది గాలి వాటమని ఎద్దేవా చేశారు.

ఇక షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతారని కందాల ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలు కాదనే విషయం అందరికీ తెలుసని, ఆమె మామ గారిది గుంటూరు అని చెప్పారు. షర్మిలకు ఖమ్మం జిల్లాతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘‘షర్మిల పోటీ చేస్తామంటే స్వాగతిస్తాం. కానీ ఆమె రెండేళ్లుగా ఏం చెప్తున్నారు. రాజన్న రాజ్యం తెస్తామని, తానే సీఎం అవుతానని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు” అని విమర్శించారు.

‘‘ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని పొంగులేటి చెబుతున్నారు. బీఆర్ఎస్‌ను ఒక్క సీటు కూడా గెలవనీయనని అంటున్నారు. ఎవరు గెలుస్తారు? ఎంత మంది గెలుస్తారు? అనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలో తెలుసు” అని చెప్పారు.


More Telugu News