జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణంలోనైనా ఎన్నికలకు రెడీ.. సుప్రీంకోర్టుతో కేంద్రం

  • ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే రాజ్యాంగ మార్పును తప్పుబట్టలేమన్న కేంద్రం తరపు న్యాయవాది తుషార్ మెహతా
  • ఆగస్టు 31 నాటికి జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సానుకూల ప్రకటన వస్తుందని స్పష్టీకరణ
  • జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాలపరిమితి చెప్పాలన్న సుప్రీంకోర్టు
ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. 5 ఆగస్టు 2019లో కేంద్రం రద్దు చేసిన ఈ అధికరణతో జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి హోదాను కోల్పోయింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సోమ, శుక్రవారాల్లో తప్ప మిగతా రోజుల్లో విచారించనుంది.

కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గత విచారణలో మాట్లాడుతూ.. దేశంలో అందరినీ సమానంగా చూసేలా, వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చే రాజ్యాంగ మార్పును తప్పుబట్టలేమంటూ తన వాదనలు వినిపించారు. అత్యున్నతస్థాయి సమావేశం తర్వాత ఆగస్టు 31 నాటికి జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ‘సానుకూల’ ప్రకటన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఒక కాలపరిమితిని పేర్కొనాల్సిందిగా ధర్మాసనం మంగళవారం మొదటిసారి కేంద్రాన్ని కోరింది. స్పందించిన కేంద్రం జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణాన అయినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపింది.


More Telugu News