నేపాల్‌ను ఉతికి ఆరేసిన పాకిస్థాన్.. మూడో అతిపెద్ద విజయం

  • ఆరంభ మ్యాచ్‌లో తలపడిన పాక్-నేపాల్ జట్లు
  • శతకాలతో కదం తొక్కిన బాబర్ ఆజం, ఇఫ్తికార్ అహ్మద్
  • 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన పాక్
ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో గత రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ శివాలెత్తిపోయింది. ఏకంగా 238 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం (151), ఇఫ్తికార్ అహ్మద్ (109) సెంచరీలతో విధ్వంసం సృష్టించడంతో తొలిసారి ఆసియాకప్ ఆడుతున్న పసికూన నేపాల్ విలవిల్లాడిపోయింది. పాక్ బ్యాటర్లపై నేపాల్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

అనంతరం 343 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. జట్టులో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆరిఫ్ షేక్ 26, సోంపాల్ కామి 28, గుల్సన్ ఝా 13 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4, షహీన్ అఫ్రిది, హరీశ్ రవూఫ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కెప్టెన్ బాబర్ ఆజంకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


More Telugu News