తెలంగాణలో రోడ్లను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది: బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు

  • బీఆర్ఎస్ నేతల తీరు గురివింద గింజలా ఉందని వ్యాఖ్య
  • దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువని విమర్శ
  • రోజువారీ ఖర్చుల కోసం భూములు అమ్మే పరిస్థితి వచ్చిందన్న కిషన్ రెడ్డి
గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతల తీరు గురివింద గింజలా ఉందన్నారు. దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువగా వున్నాయని ఆరోపించారు. పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా వ్యాట్ తగ్గిస్తే సీఎం కేసీఆర్ ఇక్కడ ఎందుకు తగ్గించలేదో చెప్పాలన్నారు. 

రోజువారీ ఖర్చుల కోసం భూములు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. భూములు అమ్మకుండా, మద్యం అమ్మకుండా ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు. రోడ్లను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాత్కాలిక అవసరాల కోసం ఓఆర్ఆర్‌ను ముప్పై ఏళ్లకు లీజుకు ఇచ్చారన్నారు.

మాజీ గవర్నర్ విద్యాసాగర రావు తనయుడు చెన్నమనేని వికాస్ బుధవారం కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ కె లక్ష్మణ్‌ల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ రెండుసీట్లు గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.


More Telugu News