బీజేపీతో పొత్తుపై టీడీపీ ఊగిసలాట ధోరణిని వీడాలి: సీపీఐ నారాయణ సూచన

  • కేసీఆర్ నుండి ఇంకా ముందే బయటకు రావాల్సిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు కలిస్తే బీఆర్ఎస్‌కు డిపాజిట్ రాదని జోస్యం
  • ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయన్న నారాయణ   
  • కమ్యూనిస్ట్‌లు, జనసేనతో కలిసి టీడీపీ ఓ కూటమిని ఏర్పాటు చేయాలని సూచన 
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్‌కు మద్దతిచ్చామని సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ నుండి తాము ఇంకా ముందే బయటకు రావాల్సిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుమ్ములాటలే ఉంటాయన్నారు. తెలంగాణలో కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్ కలిస్తే బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు.

ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ.... పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఊగిసలాట ధోరణిని వీడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయని, ఇప్పటికైనా టీడీపీ మేల్కొని ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేయాలన్నారు. వైసీపీ, బీజేపీ పార్టీలు విడిపోవని జోస్యం చెప్పారు. ఏపీలో బీజేపీ ఎంతగా కొట్లాడినా వైసీపీని ఓడించే పరిస్థితికి చేరుకోదన్నారు.

ఏపీకి అన్ని విధాలుగా నష్టం చేసిన బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టీడీపీ మద్దతు అందించడం ఏమాత్రం సరికాదన్నారు. అందుకే బీజేపీతో పొత్తు గురించి ఊగిసలాట ధోరణి నుండి బయటకు వచ్చి సీపీఐ, సీపీఎం, జనసేనతో టీడీపీ ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజిన్ ఫెయిల్ అవుతుందన్నారు. అది ఏపీకి కూడా ఉపయోగకరమన్నారు. చంద్రయాన్‌తో బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు. చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టి ఓ మతాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో మద్యం వ్యాపారులకు చోటు ఇవ్వడం ఏమాత్రం సరికాదని నారాయణ అన్నారు. మాంసం అమ్మేవాళ్లను టీడీపీ మెంబర్లుగా చేశారని, లిక్కర్ అమ్మేవారిని తిరుమల కొండపైకి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News