భారత యువ సంచలనం తిలక్ వర్మ గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ

  • అతను భారత జట్టులోకి రావడం సంతోషంగా ఉందన్న విజయ్
  • తిలక్ లో చాలా ప్రతిభ ఉందని కితాబు
  • ఆసియా కప్ ముంగిట స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న హీరో
అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ క్రికెట్‌పై తన అసక్తిని, అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఈ రోజు మొదయ్యే ఆసియా కప్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ చానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఈ రోజు విడుదల చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించిన విజయ్.. తెలుగు ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతను భారత జట్టులో చోటు దక్కించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. అతనిలో చాలా ప్రతిభ ఉందని, మున్ముందు మరింత దూరం వెళ్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

 ఇక, గతేడాది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ – పాకిస్థాన్ పోటీని ప్రత్యక్షంగా చూసిన తన అనుభవాన్ని గుర్తుచేసున్నాడు. ‘స్టేడియంలో నేను వీక్షించిన ఏ మ్యాచ్‌ లోనూ భారత్ ఓడిపోలేదు. కానీ, స్టేడియంలో చూస్తున్నప్పుడు రీప్లేలు, కామెంటరీని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. అందుకే ఈ మధ్య నేను కేవలం టీవీలోనే మ్యాచ్‌ లను ఆస్వాదిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. ఈ టోర్నీలో హోరాహోరీ మ్యాచ్‌ లు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. ఈ షోలో తన ఖుషి సినిమా గురించి కూడా విజయ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


More Telugu News