వాయు కాలుష్యానికి ఐదేళ్ల ఆయుష్షు ఆవిరి

  • భారతీయుల ఉసురు తీస్తున్న పొల్యూషన్
  • ఢిల్లీ వాసుల ఆయువును 12 ఏళ్లు కరిగిస్తోందంటున్న అధ్యయనకారులు
  • షికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
వాయు కాలుష్యం మనుషులను మరణానికి చేరువయ్యేలా చేస్తోందని, భారతీయులు ఐదేళ్ల జీవితాన్ని పోగొట్టుకుంటున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజూ వాయు కాలుష్యానికి ఎక్స్ పోజ్ కావడం వల్ల భారతీయుల ఆయుర్దాయం సగటున ఐదేళ్లు తగ్గుతోందని పేర్కొంది. ఇక వాయు కాలుష్యానికి పేరొందిన ఢిల్లీలో నివసిస్తున్న వారు ఏకంగా తమ జీవితంలో 12 ఏళ్లు కోల్పోతున్నారని తెలిపింది. ఈమేరకు అమెరికాలోని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రమాణాలతో పోల్చితే వాయు కాలుష్యం విషయంలో బంగ్లాదేశ్ టాప్ లో ఉండగా తర్వాతి స్థానం భారతదేశానిదేనని యూనివర్సిటీ ఆఫ్ షికాగో అనుబంధ సంస్థ ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఈపీఐసీ) వెల్లడించింది. డబ్ల్యూహెచ్ వో ప్రమాణాల ప్రకారం.. దాదాపుగా 130 కోట్ల మంది భారతీయులు వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని చెప్పింది. భారత దేశం సొంతంగా నిర్దేశించుకున్న వాయు ప్రమాణాల ప్రకారం చూసినా.. దేశ జనాభాలో 67.4 శాతం మంది కాలుష్యంతో కలిసి జీవిస్తున్నారని పేర్కొంది. భారత్ లోని వివిధ నగరాలలో వాయు పొల్యూషన్ ఆధారంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు కోల్పోతున్న సగటు ఆయు ప్రమాణాన్ని తెలుపుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఈపీఐసీ జాబితా ప్రకారం..

  • వాయు కాలుష్యం వల్ల గుర్గావ్ వాసులు సగటున 11.2 ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోతున్నారు
  • ఫరీదాబాద్ వాసులు 10.8 ఏళ్లు
  • యూపీలోని జౌన్ పూర్ వాసులు 10.1 ఏళ్లు
  • లఖ్ నవూ, కాన్పూర్ వాసులు 9.7 ఏళ్లు
  • ప్రయాగ్ రాజ్ వాసులు 9.2 ఏళ్లు
  • బీహార్ లోని ముజఫ్ఫర్ పూర్ వాసులు 9.2 ఏళ్లు
  • పాట్నా వాసులు 8.7 ఏళ్ల జీవితాన్ని వాయు కాలుష్యం కారణంగా కోల్పోతున్నారని అధ్యయనకారులు తెలిపారు.


More Telugu News