మోదీ చెబుతున్నది అబద్ధమని చాలా రోజులుగా చెబుతున్నా.. అది నిజమైంది: రాహుల్‌గాంధీ

  • చైనా మ్యాప్‌పై ప్రధాని ఏదో ఒకటి మాట్లాడాలన్న రాహుల్ గాంధీ
  • చైనా మన భూమిని లాక్కుందన్న కాంగ్రెస్ నేత
  • చైనాకు ఇలాంటి అలవాటేనన్న విదేశాంగ మంత్రి
చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్‌లో భారత భూభాగాలను కూడా తనవిగా చూపించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. భారత సరిహద్దు వెంబడి జరుగుతున్న చైనా కార్యకలాపాలపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. చైనా విషయంలో ఏదో ఒకటి మాట్లాడాల్సిందేనని అన్నారు. లడఖ్‌లో ఒక్క అంగుళం కూడా భూమి ఆక్రమణకు గురికాలేదని ప్రధాని చెబుతున్నది అబద్ధమని తాను చాలా సంవత్సరాలుగా చెబుతున్నానని, చైనా అతిక్రమించిందన్న విషయం లడఖ్ మొత్తానికి తెలుసని అన్నారు. ఈ మ్యాప్ చాలా తీవ్రమైన అంశమని, వారు మన భూమిని లాక్కున్నారని, దీనిపై ప్రధాని ఏదైనా మాట్లాడాలని డిమాండ్ చేశారు. 

చైనా సోమవారం కొత్త ఎడిషన్ ‘స్టాండర్డ్ మ్యాప్’ను విడుదల చేసింది. అందులో అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతంతోపాటు తైవాన్, వివాదాస్పద సౌత్‌ చైనా సముద్రాన్ని తనవిగా చూపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవంగ్రా స్పందించింది. బీజింగ్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనాకు ఇలాంటివి అలవాటుగా మారిందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు.


More Telugu News