అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

  • సింగపూర్ లోని ఎస్ఐఎంసీలో సభ్యుడిగా నియామకం
  • నియామక పత్రాలు అందించిన ఎస్ఐఎంసీ అధ్యక్షుడు జార్జి లిమ్
  • అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా ఎస్ఐఎంసీకి గుర్తింపు
  • గతేడాది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను అరుదైన గౌరవం వరించింది. సింగపూర్ లోని ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ (ఎస్ఐఎంసీ) ఆయనకు సభ్యత్వాన్ని అందించింది. ఇకపై ఆయన ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానెల్ లో సభ్యుడిగా వ్యవహరిస్తారు. 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ గతేడాది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ విరమణ చేశారు. సింగపూర్ న్యాయశాఖ, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వాణిజ్య చట్టం కమిషన్, మరో 20 సంస్థలు కలిసి సింగపూర్ కన్వెన్షన్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 

ఈ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ ప్రతినిధులతోనూ... రిలయన్స్, టాటా, ఆదిత్య బిర్లా గ్రూప్, మహీంద్రా వ్యాపార సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. మధ్యవర్తిత్వంపై మద్దతుకు సంబంధించిన 'డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్' పత్రాలపై సంతకాలు చేసేందుకు జస్టిస్ ఎన్వీ రమణ భారత దిగ్గజ వ్యాపార సంస్థలను ఒప్పించారు. ఈ క్రమంలో, ఎస్ఐఎంసీలో ఆయనను సభ్యుడిగా నియమించారు. ఆ మేరకు ఎస్ఐఎంసీ అధ్యక్షుడు జార్జి లిమ్ నియామకపత్రాన్ని ఎన్వీ రమణకు అందజేశారు.  

జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీకాలంలో మధ్యవర్తిత్వానికే తొలి ప్రాధాన్యత ఇచ్చేవారు. నేరుగా కోర్టులకు రాకుండా మధ్యవర్తిత్వంతో సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల కోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని, సత్వరమే న్యాయం జరుగుతుందని భావించేవారు. సరిగ్గా అలాంటి ఆలోచనలతోనే ఏర్పాటైన ఎస్ఐఎంసీలో ఆయనకు సభ్యత్వం లభించడం విశేషం.


More Telugu News