ఎన్టీఆర్ రూ.100 నాణెంపై ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది: విజయసాయిరెడ్డి

  • రూ.100 నాణెం పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోనుందన్న వైసీపీ ఎంపీ
  • మింట్‌లో అచ్చువేసే 12 వేల నాణేలను హెరిటేజ్‌తో కొనిపిస్తారా? అని ప్రశ్న
  • ఎన్టీఆర్‌ను చెల్లని కాయిన్ చేసినట్లేగా అన్న విజయసాయిరెడ్డి
స్వర్గీయ నందమూరి తారకరామారావు స్మారకార్థం విడుదలైన రూ.100 నాణెం పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోనుందని, మహానుభావుడు ఎన్టీఆర్‌ను చెల్లని కాయిన్ చేసినట్లుగా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. 

ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం... మిగతా కాయిన్స్, కరెన్సీలాగా మార్కెట్ చలామణిలో ఉండదని తెలిపారు. దాని విలువను కూడా కేంద్ర ఆర్థిక శాఖ రూ.4,160గా నిర్ణయించిందన్నారు. కానీ చంద్రబాబు బృందం చేసిన హడావుడి అంతా ఇంతా కాదన్నారు. మింట్‌లో అచ్చు వేసే 12 వేల నాణాలను చంద్రబాబు హెరిటేజ్‌తో కొనిపిస్తారేమోనని ఎద్దేవా చేశారు.

పురందేశ్వరిని ప్రస్తావిస్తూ... చిన్నమ్మా... అంటూ మరో ట్వీట్ చేశారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఏంటమ్మా? భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఆయన ఆత్మను క్షోభకు గురిచేశారు కదా అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం కొనుగోలు ధర రూ.4,160గా నిర్ణయించారని, నాణెం తయారీకి 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ లోహాలు కలుస్తున్నాయని, కానీ ఇంతాచేస్తే ఈ నాణెం చెలామణి కోసం కాదని, సేకరణ కోసం మాత్రమే అంటున్నారని పేర్కొన్నారు. అంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్‌ని చంద్రబాబు చెల్లని కాయిన్ చేసినట్టేగా అని పేర్కొన్నారు.


More Telugu News