పేరులేని ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరో జగన్ కే తెలియాలి: పట్టాభి

  • ఇసుక తవ్వకాల అంశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేత పట్టాభిరామ్
  • చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమివ్వాలని డిమాండ్
  • స్పందించేంత వరకు వదిలిపెట్టబోమని స్పష్టీకరణ
ఇసుక తవ్వకాల అంశంపై వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ముసుగులో బినామీలను సబ్ కాంట్రాకర్లుగా పెట్టి జగన్ రెడ్డి సాగిస్తున్న ఇసుక దోపిడీ సదరు సంస్థ క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆధారంగా బట్టబయలైందని అన్నారు. 

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలతో తమకేం సంబంధం లేదని, ఊరూ పేరు లేని మరో పార్టీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని, ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి కూడా తెలుసంటున్న జేపీ వెంచర్స్ సంస్థ రిపోర్టులపై ఇసుకాసురుడు జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. 

జేపీ పవర్ వెంచర్స్ క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిపోర్ట్ లో బయటపడిన నిజాలు -  ‘ఇసుకాసురుడు’ జగన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు: పట్టాభి 
   
 1. జూలై 28, 2023న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు బీ.ఎస్.ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్), ఎన్.ఎస్.ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) లకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన క్వార్టర్లీ  ఫైనాన్షియల్ రిపోర్టును సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ యాక్ట్-2015 సెక్షన్ 33 (3) ప్రకారం సమర్పించడం జరిగింది. 

సదరు రిపోర్టులో రెండు సంవత్సరాల పాటు ఏపీలో ఇసుక తవ్వకాలకు సంబంధించి 14 మే 2021న రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వారితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని, రెండేళ్ల కాంట్రాక్ట్ కు సంబంధించి ప్రభుత్వానికి రూ.1528 కోట్లు చెల్లించాల్సి ఉందని, సదరు కాంట్రాక్ట్ ను మరో పార్టీకి సబ్  కాంట్రాక్ట్ ఇచ్చినట్టు (పేరు వెల్లడించలేదు) స్పష్టంగా పేర్కొన్నారు. మేం చెల్లిస్తామన్న రూ.1528 కోట్లను... సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న పార్టీ ఏపీ ప్రభుత్వానికి చెల్లిస్తుందని, ఈ వివరాలను డీఎంజీ (డైరెక్టరేట్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ) వారు నోట్ చేసుకున్నారని చెప్పడం జరిగింది. 

జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఎవరికైతే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందో సదరు పార్టీ 30 జూన్ 2023 నాటికి రూ.302.45 కోట్లు ఏపీ ప్రభుత్వానికి బాకీ ఉన్నాడని, జేపీ పవర్ వెంచర్స్ వారు వారి ఫైనాన్షియల్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. సదరు సబ్ కాంట్రాక్టర్ ఎవరో, వారు ప్రభుత్వానికి ఎందుకు రూ.302.45 కోట్ల బకాయిలు బాకీపెట్టారో, ఇసుకాసురుడు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 

సదరు సబ్ కాంట్రాక్ట్ పొందిన (వ్యక్తి / సంస్థ) చెల్లించాల్సిన రూ.302.45 కోట్లు చెల్లిస్తారనే ఆశాభావం తమకు ఉందని జేపీ పవర్ వెంచర్స్ తన రిపోర్టులో రాసింది. అలా రాయడం వెనకున్న మతలబు ఏమిటో కూడా జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 

సదరు సంస్థకు, ఏపీలో జరిగే ఇసుక తవ్వకాలకు సంబంధం లేనప్పుడు, ఆ సంస్థ పేరుతో రాష్ట్రంలోని ఇసుక రీచ్ లలో తవ్వకాలు ఎవరు జరుపుతున్నారు? వారి పేర్లతో కూడిన బిల్లులు ఎవరు ఇస్తున్నారో జగన్ రెడ్డి  సమాధానం చెప్పాలి. 

2. మే 9, 2023న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ  బీ.ఎస్.ఈ, ఎన్.ఎస్.ఈ లకు సమర్పించిన మరో క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిపోర్టులో కూడా ఇదే అంశం ప్రస్తావించింది. ఏపీలో ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్  పొందిన సబ్ కాంట్రాక్టర్ 31 మార్చి 2023 నాటికి 216.90 కోట్లు డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డీఎంజీ) వారికి చెల్లించాల్సి ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. అది కాస్త 30 జూన్ 2023 నాటికి రూ.86 కోట్లు పెరిగి రూ.302.45 కోట్లకు చేరింది. 

అదే విధంగా ఎస్క్రో అకౌంట్ ప్రారంభించడం వంటి నిబంధనలను కూడా సదరు పేరులేని సబ్ కాంట్రాక్టర్ పాటించలేదని కూడా నివేదికలో పేర్కొన్నారు. ఈ లెక్కన సదరు ఊరూపేరూ లేని సబ్ కాంట్రాక్టర్ని తెరపైకి తీసుకొచ్చి, జేపీ వెంచర్స్ సంస్థను డమ్మీగా చూపుతూ, జగన్ రెడ్డి అతని గ్యాంగే రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిస్తోందని స్పష్టమవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.302.45 కోట్లు ఎగనామం పెట్టారన్న విషయం కూడా అర్థమవుతోంది.

3. ఎవర్ని మోసగించడానికి నేటికీ జేపీ పవర్ వెంచర్స్ పేరుతో బిల్లులు ఇస్తున్నారు? తాను సాగిస్తున్న ఇసుకదోపిడీపై ఇసుకాసురుడు జగన్ రెడ్డి నోరు విప్పాల్సిందే. చంద్రబాబునాయుడు ప్రశ్నలు అడిగి 48 గంటలు దాటినా జగన్ రెడ్డి ఇంకా మౌనంగా ఉంటానంటే వదిలిపెట్టేది లేదు. అందుకే జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఆడిట్ రిపోర్టుల సాక్షిగా మరలా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో సాగుతున్న ఇసుకదోపిడీపై ఇసుకాసురుడు జగన్ రెడ్డి నోరు విప్పే వరకు వదిలిపెట్టం" అని పట్టాభి స్పష్టం చేశారు.


More Telugu News