నాకు చెప్పులు కొనడానికి కూడా మా నాన్న దగ్గర డబ్బులు ఉండేవి కావు: తనికెళ్ల భరణి

  • తెలుగు ఇండస్ట్రీలో తనికెళ్ల భరణి స్థానం ప్రత్యేకం 
  • తన తండ్రి గురించిన ప్రస్తావన
  • ఆర్ధిక ఇబ్బందులు చూస్తూ పెరిగానని వెల్లడి 
  • తండ్రి కష్టాలే తప్ప కన్నీళ్లు చూడలేదని వ్యాఖ్య  

రచయితగా .. నటుడిగా .. దర్శకుడిగా తనికెళ్ల భరణి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మాది చాలా పెద్ద ఫ్యామిలీ .. మేము ఏడుగురం అన్నదమ్ములం .. నాన్న జీతం 750 రూపాయలు. అందువలన సహజంగానే ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి" అన్నారు.

" నేను ఏడో తరగతికి వచ్చేవరకూ నాకు చెప్పులు కొనడానికి కూడా మా నాన్న దగ్గర డబ్బులు ఉండేవి కాదు. కూరగాయలు కొనడానికి వెళ్లేటప్పుడు నేను మా నాన్న వెంటే వెళ్లేవాడిని. ఒకసారి అలా వెళుతున్నప్పుడు ఒక చెప్పుల షాపు దగ్గర, కావాలనే నేను కాలుతున్న సిగరెట్ పై కాలువేసి పెద్దగా అరిచాను. అప్పుడు మా నాన్న బాధపడి .. ఆ పక్కనే ఉన్న షాపులోకి తీసుకుని వెళ్లి చెప్పులు కొనిపెడతాడని అనుకున్నాను. 

"కానీ ఆయన 'ఆ మాత్రం చూసుకోవా వెధవా" అంటూ ఫెళ్లుమని కొట్టాడు. మధ్యతరగతిలో ఉండటం .. మధ్య తరగతివాడిగా బ్రతకడం మా నాన్న మాకు నేర్పారు. ఆయన చాలా కష్టాలు పడ్డారు .. కానీ ఎప్పుడూ కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేదు. నేను ఎక్కువగా ఆకతాయి పనులు చేసేవాడిని. సినిమాలు చూడటం కోసం మా నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని. అది తెలిసి ఆయన నన్ను కొట్టేసేవాడు" అంటూ చెప్పుకొచ్చారు. 


More Telugu News