పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం: నారా లోకేశ్

  • ఏలూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • శ్రీరామవరంలో పోలవరం నిర్వాసితులతో లోకేశ్ ముఖాముఖి
  • డయాఫ్రం వాల్ పరిస్థితి ఏమిటో తెలియదని వెల్లడి
  • పూర్తిగా అధ్యయనం చేస్తే తప్ప పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. లోకేశ్ ఇవాళ శ్రీరామవరంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో ఉందని తెలిపారు. డయాఫ్రం వాల్ పరిస్థితిపై స్పష్టత లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం ఏమీ చెప్పలేకపోతోందని లోకేశ్ విమర్శించారు. సమగ్ర అధ్యయనం చేస్తే తప్ప... పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొన్నారు. 

"గతంలో మేం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. నాడు టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. జగన్ లాగా మాయ మాటలు చెప్పి, రేపు అధికారంలోకి వచ్చాక పరదాలు కట్టుకుని తిరగాలనే కోరిక నాకు లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై బాధ్యత తీసుకుంటాను. 

45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం కట్టాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు తెలంగాణ నుంచి ముంపు మండలాలను మోదీ గారి సహకారంతో విలీనం చేసుకున్నాం. ఇప్పుడు టీడీపీ లక్ష్యం ఏంటంటే... నిర్దేశించిన ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అందజేయడం, నిర్వాసితులకు మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీలు నిర్మించడం. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పక నెరవేరుస్తామని వీటన్నింటిపై ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా" అని లోకేశ్ తెలిపారు.


More Telugu News