తుమ్మల పార్టీ మార్పుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య స్పందన
- తుమ్మల కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం
- తుమ్మల వంటి పెద్దలు వస్తే స్వాగతిస్తామన్న పొదెం వీరయ్య
- భద్రాద్రి జిల్లాను తుమ్మల ఎంతో అభివృద్ధి చేశారని వ్యాఖ్య
పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తుమ్మల నాగేశ్వరరావుకు నిరాశ మిగిలింది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, పార్టీ సీనియర్లతో కూడా చర్చలు జరిపినట్టు ప్రచారం జరిగింది. మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో తుమ్మల భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అంటూ పలు రకాలుగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ... తుమ్మల వంటి పెద్దలు కాంగ్రెస్ లోకి వస్తే అందరం స్వాగతిస్తామని చెప్పారు. భద్రాద్రి జిల్లాను తుమ్మల ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. పార్టీలోకి తుమ్మల రావాలని తాను కోరుతున్నానని చెప్పారు.