విద్యార్థులకు ఆనంద్ మహీంద్రా కీలక సూచన

  • కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై కలత చెందిన  ఆనంద్ మహీంద్రా
  • ఈ వయసులో మీరేంటో నిరూపించుకోవడం లక్ష్యం కాకూడదని సూచన
  • మీ గురించి మీరు తెలుసుకోవాలని, ట్యాలెంట్ వెలికితీయాలని హితవు
నీట్ కోసం కోచింగ్ తీసుకుంటూ, ఒత్తిడి భరించలేక రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిణామంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చలించిపోయారు. ఇది తనను ఎంతో కలిచివేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఇద్దరు విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది ఇంత వరకు కోటాలో ఇలా బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల సంఖ్య 20 దాటేసింది. దీంతో ఆనంద్ మహీంద్రా విద్యార్థులకు కీలక సూచన చేశారు. ‘‘మీరేంటో నిరూపించుకోవడం కాదు. ముందు మీరేంటో తెలుసుకోండి’’ అని ఆయన సూచించారు.  

‘‘ఈ వార్త చూసి కలత చెందాను. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు రాలిపోతుండడం బాధాకరం. పంచుకోవడానికి నా దగ్గర గొప్ప జ్ఞానం లేదు. కానీ కోటాలోని ప్రతి విద్యార్థికి ఒక్కటి చెప్పదలుచుకున్నాను. జీవితంలో ఈ దశలో మీరేంటో నిరూపించుకోవడం లక్ష్యం కాకూడదు. మిమ్మల్ని మీరు గుర్తించడమే లక్ష్యం కావాలి. పరీక్షల్లో సక్సెస్ కాకపోవడం అన్నది స్వీయ అన్వేషణ ప్రక్రియలో భాగం. అంటే మీ అసలైన ట్యాలెంట్ మరెక్కడో ఉంది. దాన్ని వెతకండి, ప్రయాణించండి. అంతిమంగా మీరు దాన్ని కనిపెడతారు. వెలుగులోకి తీసుకొస్తారు’’ అంటూ ఆనంద్ మహీంద్రా కీలక సూచనలు చేశారు.


More Telugu News