మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా?: ఉప్పల్ ఎమ్మెల్యే ఆవేదన

  • తనకు ఉప్పల్ టికెట్ ఎందుకు ఇవ్వలోదో చెప్పాలన్న బేతి సుభాష్ రెడ్డి
  • ఉద్యమకారులు ఎమ్మెల్యేగా ఉండొద్దా? అని ప్రశ్న 
  • వారం పదిరోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి
ఉప్పల్ టికెట్ తనకు దక్కకపోవడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎప్పుడైనా పార్టీ జెండా మోశారా? పార్టీ కోసం ఏం చేశారు? అని ప్రశ్నించారు. తనకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలు చేసిన వారికి టికెట్ ఇస్తారా? అని ఆరోపించారు.

ఈ రోజు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులు ఎమ్మెల్యేగా ఉండొద్దా? అని ప్రశ్నించారు. ‘‘ఏం పాపం చేశానని నన్ను తీసేశారు? ఏమైనా తప్పు చేస్తే చెప్పండి. మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా? ఉరి శిక్ష పడిన ఖైదీ ఆఖరి కోరిక అడిగి ఉరి తీస్తారు. నాకు అలాంటి చాన్స్ కూడా లేదా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

నేనేమైనా కబ్జాలు చేశానా? లేక దళితబంధులో కమీషన్లు తీసుకున్నానా? అని సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఇంకా కొన్నిరోజులు ఎదురుచూస్తానని చెప్పారు. వారం పదిరోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.


More Telugu News