ఒక్కో ఎకరం రూపాయికి.. దీన్ని ఎలా సమర్థించుకుంటారు?: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
- బుద్వేల్‌లో ఐదెకరాలు ఎడ్యుకేషనల్ సొసైటీకి కేటాయించిన ప్రభుత్వం
- ఒక్కో ఎకరం రూపాయికే ఇవ్వడంపై పిల్ దాఖలు
- దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
కోట్లు విలువ చేసే భూములను ఎకరం రూ.1 చొప్పున ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం బుద్వేల్‌లో ఐదెకరాలను ఎకరం రూపాయి చొప్పున రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి కేటాయించడంపై సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూ కేటాయింపులను ఎలా సమర్థించుకుంటారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
బుద్వేల్‌లో ఐదెకరాల భూమిని సొసైటీకి కేటాయిస్తూ 2018 సెప్టెంబర్ 9న జారీ చేసిన జీవో 195ను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త కోటేశ్వరరావు, మరొకరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ భూ కేటాయింపులపై 2018లో జీవో జారీ చేసినా బయటికి మాత్రం రిలీజ్ చేయలేదని కోర్టుకు పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలియజేశారు. కొన్ని రోజుల తర్వాత పబ్లిక్ డొమైన్‌లో పెట్టడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. భూ కేటాయింపులకు తగిన కారణాలున్నాయని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు చెప్పారు. దీంతో విచారణను మరో నాలుగు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.