అదానీ కంపెనీల్లో షార్ట్ సెల్లింగ్ తో 12 సంస్థలకు లాభాలు: సెబీ రిపోర్ట్

  • హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడించడానికి ముందే అమ్మకాలు
  • కొన్ని సంస్థలు మొదటిసారిగా షార్ట్ సెల్లింగ్ కు పాల్పడినట్టు గుర్తింపు
  • ఈడీ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు
ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలపై తీవ్ర ఆరోపణలతో విడుదల చేసిన నివేదిక వెనుక సున్నిత అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అదానీ గ్రూపు కంపెనీల ఖాతాల్లో అవకతవకలపై సెబీ దర్యాప్తు చేసి, తన నివేదికను సుప్రీంకోర్టుకు గత శుక్రవారం సమర్పించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించాల్సి ఉంది. ఈ నివేదికలోని కొన్ని అంశాలు వెలుగు చూశాయి. కావాలనే ఓ పథకం ప్రకారం అదానీ గ్రూప్ కంపెనీల్లో షార్ట్ సెల్లింగ్ (తమ వద్ద ఏమీ లేకపోయినా చేబదులు తెచ్చుకుని అమ్మకాలు చేయడం) పొజిషన్లు తీసుకుని 12 సంస్థలు లాభపడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్ ఫోర్ట్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చింది. హిండెన్ బర్గ్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ, ఈ సమాచారాన్ని సెబీకి జూలైలోనే అందించింది.

హిండెన్ బర్గ్ నివేదిక జనవరి 24న విడుదల కాగా, దీనికంటే రెండు మూడు రోజుల ముందుగా ఆయా సంస్థలు షార్ట్ సెల్లింగ్ తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. కొందరు/కొన్ని సంస్థలు అయితే షార్ట్ సెల్లింగ్ కు దిగడం మొదటిసారి అని తెలిసింది. మూడు కంపెనీలు భారత్ కేంద్రంగా పనిచేసేవి. ఒకటి విదేశీ బ్యాంక్ కు చెందిన భారత బ్రాంచ్. నాలుగు సంస్థలు మారిషస్ కేంద్రంగా పనిచేస్తున్నవి. అలాగే, ఫ్రాన్స్, హాంగ్ కాంగ్, కేమన్ ఐలాండ్స్, లండన్ నుంచి ఒక్కో సంస్థ షార్ట్ సెల్లింగ్ లో పాల్గొన్నాయి. ఉదాహరణకు ఒక సంస్థ 2020 జూలైలోనే ఏర్పాటైంది. 2021 సెప్టెంబర్ వరకు కార్యకలాపాలు ఏమీ లేవు. కానీ, 2021 సెప్టెంబర్ నుంచి 2022 మార్చి వరకు రూ.31,000 కోట్ల టర్నోవర్ పై రూ.1,100 కోట్ల లాభం వచ్చినట్టు ప్రకటించింది. మొత్తం సెబీ 22 అంశాలపై తన దర్యాప్తును పూర్తి చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించగా, మరో రెండు అంశాలపై  విదేశీ ఏజెన్సీల నుంచి సమాచారం కోసం చూస్తున్నట్టు తెలిపింది. విదేశీ సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల్లో షార్ట్ సెల్లింగ్ కు పాల్పడడానికి వీలుగా ఎఫ్ పీఐలు, ఎఫ్ఐఐలు బ్రోకర్లుగా పనిచేసి ఉంటారని, అసలు లాభాలకు వాళ్లు లబ్ధిదారులు కాకపోవచ్చని ఈడీ తన దర్యాప్తులో తేల్చింది.


More Telugu News