గోతిలో పడే ముప్పు తప్పింది... ఇస్రో సూచనలతో దారి మార్చుకున్న ప్రజ్ఞాన్ రోవర్
- చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్-3
- 4 మీటర్ల వ్యాసం ఉన్న గొయ్యిని గుర్తించి రోవర్ ను అప్రమత్తం చేసిన ఇస్రో
- గొయ్యికి 3 మీటర్ల ఇవతలి నుంచే రూటు మార్చిన రోవర్
- ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ప్రస్థానం కొనసాగుతోంది. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని సేకరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ఓ ప్రమాదాన్ని అధిగమించింది. ఇస్రో అప్రమత్తం చేయడంతో 4 మీటర్ల వ్యాసం ఉన్న గోతిలో పడే ముప్పును రోవర్ తప్పించుకుంది. ఇస్రో సూచనలు అనుసరించి దారి మార్చుకుని సురక్షిత మార్గంలో ప్రయాణం ఆరంభించింది. గొయ్యి మరో 3 మీటర్ల దూరంలో ఉందనగా, ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి రోవర్ కు సంకేతాలు పంపింది. ఈ ఘటన నిన్న జరిగింది. ఈ మేరకు రోవర్ గమనానికి సంబంధించిన రెండు ఫొటోలను ఇస్రో పంచుకుంది. అందులో గొయ్యి ఉన్న ప్రాంతం, రోవర్ కొత్త దారిని చూడొచ్చు.