ఫైనల్‌ను భారత్–పాక్ పోరులా చూశారు: జావెలిన్ చాంపియన్ నీరజ్ చోప్రా
- నిజానికి ఐరోపా అథ్లెట్లు చాలా ప్రమాదకరమన్న నీరజ్ చోప్రా
- ఏ సమయంలోనైనా వారు ఎక్కువ దూరం ఈటెను విసరగలరని వెల్లడి
- వచ్చే ఆసియా గేమ్స్‌లో కూడా భారత్–పాక్ పోరుపై మరింత జరుగుతుందన్న చాంపియన్
ఒలింపిక్స్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ‘జావెలిన్ త్రో’ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. 88.17 మీటర్ల దూరం ఈటెను నీరజ్ విసరగా.. పాకిస్థాన్ త్రోయర్ అర్హద్ నదీమ్ 87.82 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు.
ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ.. తమ ఫైనల్ మ్యాచ్‌ను భారత్ వర్సెస్ పాక్ అన్నట్లుగానే చూశారని చెప్పుకొచ్చాడు. ‘నేను పోటీకి ముందు ఎక్కువగా నా ఫోన్ వాడను. ఈ రోజు ఫోన్ చూడగా.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ అని కనిపించింది. నిజానికి ఇక్కడ ఐరోపా అథ్లెట్లు చాలా ప్రమాదకరం. ఏ సమయంలోనైనా ఎక్కువ దూరం ఈటెను విసరగలరు” అని చెప్పుకొచ్చాడు.
‘‘ఇక్కడ అర్హద్ మాత్రమే కాదు.. జాకుబ్, జూలియన్ వెబర్ కూడా ఉన్నారు. చివరి త్రో వరకు ఇతర త్రోయర్ల గురించి ఆలోచిస్తుండాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే.. స్వదేశంలో మాత్రం దీన్ని భారత్ –పాక్ మ్యాచ్ మాదిరే చూస్తారు” అని నీరజ్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఆసియా గేమ్స్‌లో కూడా భారత్–పాక్ పోరుపై మరింత జరగుతుందని అన్నాడు.