ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్లు వారసులుగా చెలామణి అవుతున్నారు: లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు

  • స్మారక నాణెం విడుదలకు తనను పిలవకపోవడం అన్యాయమన్న లక్ష్మీపార్వతి
  • ఎన్టీఆర్ భార్యనని మెడలో ఫొటో పెట్టుకుని తిరగాలా? అని ప్రశ్న
  • నాణెం అందుకోవడానికి అర్హత తనకే ఉందని వ్యాఖ్య
  • ఇకపై తన పోరాటం పురందేశ్వరిపైనేనని వెల్లడి
  • చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణనలను బయటికి లాగుతానని హెచ్చరిక
  • వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానన్న లక్ష్మీపార్వతి
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ భార్యనైన తనను పిలవకపోవడం అన్యాయమని అన్నారు. ఆయన ప్రాణాలు తీసిన వాళ్లు వారసులుగా చెలామణి అవుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం విడుదల చేయడం సంతోషంగా ఉందని, కానీ తనను పిలవకపోవడం బాధగా అనిపిస్తోందని పేర్కొన్నారు. 

‘‘ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం తప్పు. ఇన్విటేషన్ చూస్తే.. ప్రైవేటు ఫంక్షన్‌కు రాష్ట్రపతి గెస్ట్‌గా వెళ్తున్నట్లు ఉంది. ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం అన్యాయం. ఆయన ప్రాణాలు తీసిన వాళ్లు వారసులుగా చెలామణి అవుతున్నారు. ఎన్టీఆర్ భార్యగా.. ఆ నాణెం అందుకోవడానికి అర్హత నాకే ఉంది. వాళ్లకు లేదు. ప్రాణాలు తీసిన వాళ్లు నాణెం విడుదల కార్యక్రమానికి వెళ్లారు” అని తీవ్రంగా విమర్శించారు. 

ఇకపై తన పోరాటం పురందేశ్వరిపైనేనని లక్ష్మీపార్వతి చెప్పారు. ‘‘ఎన్టీఆర్‌‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు కుటుంబ సభ్యులుగా చెలామణీ అవుతారా? ఎన్టీఆర్ కొడుకులు అమాయకులు. కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరి దుర్మార్గులు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి కుట్ర చేస్తోంది. పురందేశ్వరి తిరిగిన ప్రతి నియోజకవర్గంలో నేను తిరుగుతా. ఒక్క సీటు కూడా రాకుండా ప్రచారం చేస్తా” అని ప్రకటించారు. వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానని చెప్పారు. 

‘‘నన్నెందుకు చులకన చేస్తున్నారు? నన్ను చులకన చేస్తే ఎన్టీఆర్‌‌ను చేసినట్లే. ఎన్టీఆర్‌‌కు చంద్రబాబు బయట వెన్నుపోటు పొడిస్తే.. అంతర్గతంగా పురందేశ్వరి ప్రధాన కారకురాలు. ‘రాజకీయాల్లో వద్దు’ అని అన్నందుకు ఎన్టీఆర్‌‌పై పురందేశ్వరి కుట్ర చేసింది. తండ్రిపై కోపంతో కాంగ్రెస్‌లోకి వెళ్లింది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి పురందేశ్వరి అవినీతి చేశారని ఆరోపించారు. 

‘‘నన్ను ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారో లేదో ఆయన పిల్లలు సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ భార్యనని మెడలో ఫొటో పెట్టుకుని తిరగాలా? ఎన్టీఆర్‌‌తో వివాహం అయినట్లు ఫొటోలు, వార్తా కథనాలు ఉన్నాయి. సాక్షాత్తూ ఎన్టీఆర్ అనేకసార్లు బహిరంగంగా చెప్పారు. కానీ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది” అని మండిపడ్డారు. 

ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్‌గా ఉన్నానని, ఇకపై వాళ్లను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణనలను అందరినీ బయటికి లాగుతానని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానన్నారు. తనకంటే ఎక్కువ అవమానానికి పురందేశ్వరి గురవుతారని అన్నారు. 

ఎన్టీఆర్‌‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. పురందేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేయడమేంటని ప్రశ్నించారు. తాను రాసిన లేఖలకు సమాధానం రాలేదని, అందుకే ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుస్తానని చెప్పారు.


More Telugu News