ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల.. ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించిన రాష్ట్రపతి

  • ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నాణెం విడుదల
  • దేశ చలన చిత్ర రంగం పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర కీలకమన్న రాష్ట్రపతి
  • రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారని ప్రశంస
దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రూ. 100 విలువైన ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నానని చెప్పారు.

 భారత చలనచిత్ర రంగం పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. దేవుళ్ల రూపాలను ప్రజలు ఎన్టీఆర్ లో చూసుకున్నారని అన్నారు. రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన తపించారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.



More Telugu News