చంద్రుడిపై ఉష్ణోగ్రతను నమోదు చేసి పంపిన విక్రమ్ ల్యాండర్

  • శివశక్తి పాయింట్ లో ఉపరితలంపై 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • ప్రతీ రెండు సెంటీమీటర్ల లోతులో వేర్వేరు టెంపరేచర్లు
  • జాబిల్లి దక్షిణ ధ్రువంపై మధ్యాహ్నం 100 డిగ్రీల పైనే నమోదవుతుందని ఇస్రో అంచనా
జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ తాజాగా సైంటిఫిక్ డాటాను పంపించింది. అక్కడి ఉష్ణోగ్రతలను ల్యాండర్ రికార్డు చేసి పంపించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈమేరకు విక్రమ్ ల్యాండర్ పంపించిన వివరాలతో ఓ గ్రాఫ్ ను తయారుచేసి ఇస్రో ఓ ట్వీట్ చేసింది. శివశక్తి పాయింట్ (విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతం) లో జాబిల్లి ఉపరితలంపై 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది.

ఉపరితలం నుంచి కేవలం రెండు సెంటీమీటర్ల లోతులో టెంపరేచర్ 40 డిగ్రీలు ఉందని, 8 సెంటీమీటర్ల లోతుకు వెళితే అక్కడ మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. విక్రమ్ ల్యాండర్ కు అమర్చిన ఛాస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్ పరిమెంట్) అక్కడి ఉష్ణోగ్రతల వివరాలను, చంద్రుడి నేల లోపలి టెంపరేచర్ ను రికార్డు చేసి పంపిందన్నారు. ఇక మధ్యాహ్నం పూట జాబిల్లి దక్షిణ ధ్రువంపైన టెంపరేచర్ 100 డిగ్రీలకు పైనే నమోదవుతుందని అంచనా వేశారు. అదేవిధంగా రాత్రిపూట మైనస్ వంద డిగ్రీలు ఉండొచ్చని చెప్పారు.

చంద్రుడిపై వాతావరణం లేకపోవడంతో ఉష్ణోగ్రత వేగంగా మారుతుంటుందని పేర్కొన్నారు. అయితే, జాబిల్లి నేలపై ఉండే పై పొర అత్యంత పలుచగా, రాళ్లతో నిండి ఉంటుందని అన్నారు. ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతను నేల లోపలికి వెళ్లకుండా ఈ పొర అడ్డుకుంటుందని చెప్పారు. చంద్రుడిపై భవిష్యత్తులో ఆవాసాలు ఏర్పరుచుకోవడానికి ఈ పొర కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.



More Telugu News