కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ.. కాకపోతే..: కూనంనేని సాంబశివరావు

  • కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మాణిక్‌ఠాక్రేతో సీపీఐ నేతల భేటీ 
  • తమకు నాలుగు సీట్లు ఇవ్వాలని కోరిన నేతలు
  • రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే
  • మూడు ఇస్తే పొత్తుకు సిద్ధమన్న కూనంనేని
అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరును బీఆర్ఎస్ ప్రారంభించింది. బీఆర్ఎస్‌తో పొత్తు కోసం చివరి దాకా ఎదురుచూసిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్‌ఠాక్రేతో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. 

తమకు నాలుగు సీట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎదుట సీపీఐ నేతలు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం స్థానాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.

అయితే వీటిలో మునుగోడు, హుస్నాబాద్ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మూడు స్థానాలను కేటాయిస్తే పొత్తుకు తాము సిద్ధమని సాంబశివరావు చెప్పినట్లు తెలుస్తోంది.


More Telugu News