వరల్డ్ చాంపియన్ షిప్ 4×400 రిలే ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్... మనవాళ్లు చిరుతలేనన్న ఆనంద్ మహీంద్రా

  • హంగేరీలోని బుడాపెస్ట్ లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్
  • ఇవాళ 4×400 రిలే హీట్స్ నిర్వహణ
  • వరల్డ్ రికార్డు జట్టు అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచిన భారత్
  • చివరి వరకు అమెరికాకు గట్టి పోటీ ఇచ్చిన భారత రన్నర్లు
గత కొంతకాలంగా అథ్లెటిక్స్ లోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. తాజాగా వరల్డ్ చాంపియన్ షిప్ లో భారత్ పురుషుల జట్టు 4×400 రిలే ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

ముహమ్మద్ అనస్ యాహ్యా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్ వరియతోడి, రాజేశ్ రమేశ్ ఇవాళ నిర్వహించిన హీట్స్ లో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో భారత చతుష్టయం 2:59:05 టైమింగ్ తో ఆసియా రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

ఇప్పటివరకు ఆసియాలో అత్యంత వేగంగా 4×400 పరుగును పూర్తి చేసిన రికార్డు జపాన్ పేరిట ఉంది. జపాన్ బృందం 2:59:51 టైమింగ్ నమోదు చేసింది. ఇప్పుడా రికార్డును మనవాళ్లు తిరగరాశారు. 

కాగా, హంగేరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో 4×400 రిలే పోరులో అమెరికా ప్రథమస్థానంలో నిలిచింది. ఈ హీట్స్ లో భారత చతుష్టయం వరల్డ్ రికార్డు జట్టయిన అమెరికాకు చివరి వరకు గట్టిపోటీనిచ్చింది. తృటిలో మొదటిస్థానాన్ని కోల్పోయింది. అయినప్పటికీ, అందరినీ అచ్చెరువొందించే వేగంతో రెండో స్థానంలో నిలిచి తద్వారా ఫైనల్స్ కు అర్హత సాధించింది. 

దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. ప్రపంచ వేదికపై భారత అథ్లెటిక్స్ బృందం ప్రదర్శన పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేశారు. 

మనవాళ్లు ప్రపంచ చాంపియన్ షిప్ లో 4×400 రిలే ఫైనల్లోకి వెళ్లారా? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? అంటూ ఉప్పొంగే సంతోషంతో 'ఎక్స్' లో స్పందించారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు చంద్రుడ్ని ఎక్కినంత సంబరపడిపోతుంటారు... మన చిరుతలు పరిగెత్తిన విధానం చూడండి... అంటూ తన స్పందన వెలిబుచ్చారు.


More Telugu News