ఏపీలో పొత్తులపై సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు!
- బీజేపీతో కలిసి వెళ్లే పార్టీలకు ఓటమి తప్పదన్న రామకృష్ణ
- టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారని వ్యాఖ్య
- చంద్రబాబు ఆ దిశగా ఆలోచిస్తారని అనుకుంటున్నానని వెల్లడి
- కాదని బీజేపీతో కలిస్తే జగన్ నెత్తిన పాలుపోసినట్లేనని హెచ్చరిక
ఏపీలో పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లే పార్టీలకు ఓటమి తప్పదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారని, తప్పకుండా అధికారంలోకి వస్తామని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా ఆలోచిస్తారని తాను అనుకుంటున్నానని అన్నారు. అలా కాకుండా బీజేపీతో కలిస్తే జగన్ నెత్తిమీద పాలుపోసినట్లేనని, అది జగన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందని హెచ్చరించారు. చంద్రబాబు తప్పుడు నిర్ణయం తీసుకుంటారని తాము అనుకోవడం లేదని అన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి లేదని, ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆరోపించారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పోతున్నాయని మండిపడ్డారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం గుండు సున్నానే అని ఎద్దేవా చేశారు.