చార్జ్‌షీట్ కోర్టు పరిభాషలోనే ఉండాలనేం లేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

  • చార్జ్‌షీట్‌ను హిందీలో అనువదించి ఇవ్వాలన్న వ్యాపం కుంభకోణం కేసు నిందితులు
  • చార్జ్‌షీట్ ఎలా ఉండాలన్న దానిపై నిర్దిష్ఠ నిబంధనలు లేవన్న సుప్రీం ధర్మాసనం
  • ఒక్క హైకోర్టులో తప్ప మిగతా కోర్టుల్లో భాష విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయన్న న్యాయస్థానం
  • వ్యాపం కేసు నిందితులు విద్యావంతులు కావడంతో అనువదించి ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టీకరణ
చార్జిషీటు కచ్చితంగా కోర్టు పరిభాషలోనే ఉండాల్సిన అవసరం లేదని, అలాంటి నిర్దిష్ఠ నిబంధనలు ఏవీ లేవని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) ప్రకారం ఒక్క హైకోర్టులో తప్ప మిగతా కోర్టుల్లో ఏ భాషను ఉపయోగించాలన్న విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, అందులోనూ చార్జిషీట్ ఏ భాషలో ఉండాలనే దానిపై ఎలాంటి నిబంధనలు లేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం కేసులోని ఇద్దరు నిందితులు తమకు ఇంగ్లిష్ రాదని, చార్జ్‌షీట్‌ను హిందీలో అనువదించి ఇవ్వాలని ట్రయల్ కోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రాగా, సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. విచారించిన న్యాయస్థానం.. ఏ ఒక్క అంశాన్ని విస్మరించినా న్యాయం జరగదని భావించిన సందర్భాల్లో మాత్రమే నిందితులు కోరిన భాషలో చార్జ్‌షీట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాదు, ఈ కేసులో నిందితులు విద్యావంతులు కావడంతో చార్జ్‌షీట్‌ను హిందీలోకి అనువదించి ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.


More Telugu News