చంద్రయాన్-3 మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి.. ఇస్రో ట్వీట్

  • సాఫ్ట్ ల్యాండింగ్, జాబిల్లిపై రోవర్ సంచారం విజయవంతమైందన్న ఇస్రో 
  • ప్రస్తుతం జాబిల్లిపై ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడి
  • అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన మూడు లక్ష్యాల్లో రెండు పూర్తయ్యాయి. ఈ మేరకు ఇస్రో శనివారం ‘ఎక్స్’ సామాజిక వేదికలో ఓ పోస్ట్ పెట్టింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరించడం దిగ్విజయంగా పూర్తయ్యిందని తెలిపింది. 

చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా జాబిల్లి ఉపరితలంపై ప్రస్తుతం పలు ప్రయోగాలు జరుగుతున్నాయని, అన్ని వ్యవస్థలూ ఆశించిన పనితీరు కనబరుస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌తో భారత్, జాబిల్లి దక్షిణ ధ్రువంపై వ్యోమనౌక నిలిపిన తొలి దేశంగా బుధవారం ఓ అరుదైన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.


More Telugu News