ట్రంప్‌ ‘మగ్‌షాట్‌’ ఫొటోపై బైడెన్‌ సెటైర్లు!

  • ఓ కేసులో అరెస్టయి మగ్‌షాట్ తీయించుకున్న ట్రంప్
  • మగ్‌షాట్‌ తీయించుకున్న తొలి మాజీ అధ్యక్షుడిగా రికార్డు
  • ట్రంప్ నిజంగా అందమైన, అద్భుతమైన వ్యక్తి అంటూ బైడెన్ సెటైర్లు
గత అధ్యక్ష ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పూచీకత్తుతో తర్వాత విడుదలయ్యారు. ఈ క్రమంలో పోలీసు రికార్డుల కోసం ఆయన ఫొటో (మగ్‌షాట్) తీశారు. ఇలా మగ్‌షాట్‌ తీయించుకున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. 

ఈ ‘మగ్ షాట్‌’పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తాహోలోని వ్యాయామ క్లాస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మగ్ షాట్‌ గురించి ఓ రిపోర్టర్ అడగ్గా.. తొలుత బైడెన్ నవ్వేశారు. తర్వాత ‘‘ట్రంప్ నిజంగా అందమైన, అద్భుతమైన వ్యక్తి” అంటూ సెటైర్లు వేశారు. 

2020 అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జార్జియాలోని కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు రికార్డుల కోసం మగ్ షాట్ తీశారు. ఆయనకు ఖైదీ నంబర్ పీ01135809 కేటాయించారు. అరెస్టయిన 22 నిమిషాల తర్వాత 2 లక్షల డాలర్ల పూచీకత్తుపై ఆయన విడుదలయ్యారు.


More Telugu News