టీటీడీ చైర్మన్‌గా భూమన నియామకంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

  • ఆయన క్రైస్తవుడన్న ప్రచారం జోరుగా జరుగుతోందన్న ఎల్వీ
  • ప్రభుత్వం కానీ, టీటీడీ కానీ, భూమన కానీ స్పందించలేదన్న సీఎస్
  • ఇంతకంటే దురదృష్టకర ఘటన మరోటి ఉండదని ఆవేదన
  • అసలాయన ఆలయ ప్రాంగణంలోకి రావాలంటేనే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుందన్న ఎల్వీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేశారని, ఎన్నికల డిక్లరేషన్‌లో క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్టు రాశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇంత జరుగుతున్నా ఆయన ఎప్పుడూ స్పందించలేదని, ఈ విషయంలో ప్రభుత్వం కానీ, టీటీడీ కానీ, కరుణాకర్‌రెడ్డి కానీ ఎవరూ స్పందించి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ఎవరేం అనుకున్నా తమకు సంబంధం లేదని, తమకు తోచింది మాత్రమే చేస్తామన్న భావనతో వారు ఉన్నారని సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్‌రెడ్డి నిజంగానే క్రిస్టియానిటీ తీసుకుంటే కనుక ఆలయ ప్రాంగణంలోకి రావాలన్నా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుందని అన్నారు. అలా సంతకం పెట్టకుండా బంగారు వాకిలిలో నిలబడి ప్రమాణం చేయడం చెల్లదని అన్నారు. ఈ విషయాన్ని ఎవరో ఒకరు కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. 

టీటీడీకి అన్యమతస్థుడు చైర్మన్ కావడం వల్ల హిందుత్వం భ్రష్టుపట్టిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కోట్ల మంది హిందువులుండగా, ఆయననే ఎందుకు చైర్మన్‌ను చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు దూరమైపోయిందని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామితో ఆటలాడుకుంటే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టుపైనా తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.



More Telugu News