తమిళనాడులో 31 వేల స్కూళ్లకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు

  • గత ఏడాది ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ విజయవంతం
  • 17 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
  • అల్పాహార మెనూలో 13 రకాల ఆహార పదార్థాలు
తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది తొలిసారి పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించింది. 1,545 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో లక్ష మందికి పైగా విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు నాడు ప్రారంభించిన ఈ పథకం విజయవంతం కావడంతో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అన్నిటికీ దీనిని విస్తరించారు. పర్యవసానంగా మరో 31 వేల స్కూళ్లలో ఈ స్కీమ్ ను ఇప్పుడు అమలు చేస్తున్నారు.  

 ఈ ఉదయం నాగపట్నం జిల్లా తిరుక్కువలైలోని పంచాయతీ పాఠశాలలో సీఎం స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు అన్ని జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించారు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 17 లక్షల మందికి పైగా విద్యార్థులకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. 

తమిళనాడులో 1956 నుంచి మధ్యాహ్న భోజన పథకం ఇప్పటికే అమలులో ఉంది. గతేడాది అల్పాహార పథకం ప్రవేశపెట్టిన తర్వాత హాజరు శాతం 40 శాతం పెరిగింది. అన్ని పాఠశాల రోజుల్లో అల్పాహారం అందిస్తారు. మెనూలో 13 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి.


More Telugu News