అదిరిపోయే లుక్‌తో మళ్లీ వస్తున్న హీరో ‘కరిజ్మా’!

  • ఆగస్టు 29న మార్కెట్‌లోకి కరిజ్మా ఎక్స్‌ఎంఆర్
  • టీజర్‌‌ను ట్విట్టర్‌‌లో షేర్ చేసిన ‘హీరో’ మోటోకార్ప్‌
  • బ్రాండ్ అంబాసిడర్‌‌గా హృతిక్‌ రోషన్‌
ఇప్పుడంటే కేటీఎం, ఎఫ్‌జడ్‌ బైక్‌లు ఉన్నాయి కానీ.. రెండు దేశాబ్దాల కిందట కరిజ్మా బైక్ ఓ ఊపు ఊపింది. స్పోర్ట్స్‌ బైక్‌ లుక్‌లో ఈ బైక్‌ను 2003లో ‘హీరో’ మోటోకార్ప్‌ రిలీజ్ చేసింది. తర్వాత కరిజ్మా పేరుతోనే కొన్ని అప్‌డేటెడ్ మోడళ్లను విడుదల చేసింది. మళ్లీ ఇప్పుడు అదిరిపోయే లుక్‌తో కొత్తగా మార్కెట్‌లోకి కరిజ్మా ఎంట్రీ ఇస్తోంది. 

‘కరిజ్మా ఎక్స్‌ఎంఆర్’ పేరుతో కొత్త మోడల్‌ను హీరో రిలీజ్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా బైక్‌కు సంబంధించిన టీజర్‌‌ను ట్విట్టర్‌‌లో షేర్ చేసింది. ఆగస్టు 29న దీనిని మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌‌గా నియమించుకుంది. గతంలోనూ కరిజ్మాకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా హృతిక్ వ్యవహరించడం గమనార్హం. 

ఇప్పటికే రిలీజ్ చేసిన పలు టీజర్ల ప్రకారం.. 210 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో ఈ బైక్ రానుంది. సిక్స్ స్పీడ్ గేర్‌‌బాక్స్ ఏర్పాటు చేశారు. గరిష్ఠంగా 143 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. డ్యుయల్ ఏబీఎస్, డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు మోనో సస్పెన్షన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లతో ఈ బైక్ రానున్నట్లు తెలుస్తోంది. బైక్ ధర ఎంతనేది 29వ తేదీన వెల్లడయ్యే అవకాశం ఉంది.


More Telugu News