ఈపీఎఫ్ వో సభ్యులకు గుడ్ న్యూస్.. భవిష్యత్తులో మరింత రాబడి!
- ఈటీఎఫ్ ల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి
- రోజువారీ పెట్టుబడులు వెనక్కి తీసుకునే ప్రతిపాదన
- దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం
వడ్డీ రేటు తగ్గిపోయిందని బాధపడుతున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ వో) సభ్యులకు త్వరలో గుడ్ న్యూస్ రానుంది. ఈక్విటీల్లో ఉపసంహరించుకున్న పెట్టుబడులను మళ్లీ ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ఈపీఎఫ్ వో భావిస్తోంది. ఇందుకు అనుమతించాలని కేంద్ర ఆర్థిక శాఖ ముందు ఈపీఎఫ్ వో ఓ ప్రతిపాదన కూడా చేసిందన్నది సమాచారం. దీనివల్ల సభ్యుల భవిష్యనిధిపై మరింత రాబడికి అవకాశం కల్పించనుంది.
ఈటీఎఫ్ నుంచి తీసుకున్న పెట్టుబడులను మళ్లీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఈపీఎఫ్ వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది మార్చిలోనే అనుమతించడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఈపీఎఫ్ వో తన మొత్తం నిర్వహణ ఆస్తుల్లో 15 శాతం వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ ఈటీఎఫ్ పెట్టుబడులను వెనక్కి తీసుకునే ప్రతిపాదన కూడా ఉంది. దీనివల్ల తక్కువ అస్థిరతలు, మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈటీఎఫ్ లలో 2015 నుంచి ఈపీఎఫ్ వో 10 శాతం మేర ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ఈపీఎఫ్ నిర్వహణలో రూ.12.53 లక్షల కోట్లు ఉన్నాయి.