అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు ఐపీఎస్ అఫీసర్.. పని చేసిన సంస్థ ఆఫీసుకి ముఖ్య అతిథిగా రాక!

  • డెలాయిట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా పని చేసిన హర్షవర్ధన్
  • తాజాగా అదే సంస్థ కార్యాలయంలో అవగాహన కార్యక్రమానికి రాక
  • సంతోషంతో సాదరంగా ఆహ్వానించిన ఐటీ ఉద్యోగులు
  • ట్రాఫిక్ నిర్వహణలో ఐటీ పరిశ్రమ సహకారం అందిస్తోందన్న డీసీపీ హర్షవర్ధన్
అప్పుడు.. అతడో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇప్పుడు.. ఆయనో ఐపీఎస్ ఆఫీసర్. గతంలో తాను పని చేసిన సంస్థ కార్యాలయానికే ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. తోటి ఉద్యోగి ఐపీఎస్ అధికారిగా రావడంతో ఆయన్ను చూసిన ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అప్పటి ఉద్యోగి.. ఇప్పటి ఐపీఎస్ హర్షవర్ధన్‌ను సాదరంగా ఆహ్వానించారు. 

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం గచ్చిబౌలిలోని డెలాయిట్ సంస్థ కార్యాలయంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, డీసీపీ (ట్రాఫిక్–1) హర్షవర్ధన్ హాజరయ్యారు. గతంలో ఆయన అదే సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా పని చేశారు.

ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణలో ఐటీ పరిశ్రమ సహకారం అందిస్తోందని చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ట్రాఫిక్ వాలంటీర్లుగా సేవలందిస్తూ ఐటీ ఏరియాలను సురక్షిత ట్రాఫిక్ జోన్లుగా నిలపడంలో కీలకంగా ఉంటున్నారని చెప్పారు.


More Telugu News