గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ
- గద్దర్ మృతి గురించి తెలిసి బాధపడ్డానన్న మోదీ
- గద్దర్ పాటలు పేదల సమస్యలను ప్రతిబింబిస్తాయని వ్యాఖ్య
- ఆయన రచనలు ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్న ప్రధాని
ప్రజా యుద్ధ నౌక, విప్లవ కవి గద్దర్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. గద్దర్ భార్య గుమ్మడి విమలకు ఈ రోజు ఆయన లేఖ రాశారు. గద్దర్ మృతి గురించి తెలిసి చాలా బాధపడ్డానని చెప్పారు. మీరు తీవ్ర దు:ఖంలో ఉన్న ఈ సమయంలో హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
గద్దర్ పాటలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను ప్రతిబింబిస్తాయని ప్రధాని చెప్పారు. ఆయన రచనలు ప్రజలకు ఎంతో స్ఫూర్తిని అందించాయని వివరించారు. తెలంగాణ సంప్రదాయిక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో గద్దర్ చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో తన పాటతో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఎన్నో పాటలతో ఉద్యమానికి ఊపిరిపోశారు. గుండె సంబంధిత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఆయన ఈనెల 6న హఠాన్మరణం చెందారు. ఆయనకు యావత్ తెలంగాణ సమాజం కన్నీటితో నివాళులర్పించింది.