ట్విట్టర్ లోకి ట్రంప్ పునరాగమనం

  • మగ్ షాట్ పేరుతో ట్వీట్
  • నెక్ట్స్ లెవల్ అంటూ ఎలాన్ మస్క్ రిప్లయ్
  • 2021 జనవరి తర్వాత ట్రంప్ నుంచి తొలి ట్వీట్
అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్.. ఎట్టకేలకు తిరిగి ట్విట్టర్ (ఎక్స్) లోకి అడుగు పెట్టారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం వద్ద అల్లర్లలో ట్రంప్ పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ట్విట్టర్ ఆయన ఖాతాను అప్పట్లో నిలిపివేసింది. గతేడాది ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడం తెలిసిందే. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించొచ్చంటూ అప్పట్లోనే మస్క్ సంకేతాలు కూడా పంపారు. అన్నట్లుగానే ట్విట్టర్ లోకి రావాలంటూ ట్రంప్ ను ఆహ్వానించారు. అయినా ట్రంప్ పట్టించుకున్నట్టు అనిపించలేదు. 

ట్విట్టర్ తనను బ్లాక్ చేయడంతో ఆగ్రహించిన ట్రంప్, తనకంటూ సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ పేరునే ఎత్తివేసి, ఎక్స్ గా మార్చడంతో ట్రంప్ మనసు కూడా మారినట్టుంది. ఎక్స్ ప్లాట్ ఫామ్ పై తన మగ్ షాట్ (తమ రికార్డుల కోసం పోలీసులు తీసిన ఫొటో)ను కూడా పోస్ట్ చేస్తూ.. 'మగ్ షాట్ ఆగస్ట్ 24, 2023' పేరుతో ట్రంప్ కామెంట్ కూడా పెట్టారు. ‘ఎన్నికల జోక్యం.. లొంగేది లేదు’ అనే క్యాప్షన్ పెట్టారు. డోనాల్డ్ ట్రంప్ డాట్ కామ్ పేరుతో తన వెబ్ సైట్ చిరునామాను కూడా అక్కడ ప్రదర్శించారు. జార్జియా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. 2021 జనవరి తర్వాత ట్రంప్ చేసిన తొలి ట్వీట్ ఇది.  దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ, నెక్ట్స్ లెవల్ అంటూ రిప్లయ్ ఇచ్చారు.


More Telugu News