కవితకు టికెటిస్తే రాష్ట్రంలోని 33 శాతం మహిళలకు ఇచ్చినట్లే.. బండి సంజయ్ వ్యంగ్యం

  • మహిళా బిల్లు కోసం కవిత చేసిన దీక్షపై బీజేపీ నేత సెటైర్లు
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 25 సీట్లకే పరిమితమని వ్యాఖ్య
  • బీజేపీలో చేరేందుకు చాలామంది బీఆర్ఎస్ నేతలు రెడీగా ఉన్నారని వెల్లడి
మహిళా రిజర్వేషన్ల గురించి ఢిల్లీలో దీక్ష చేసిన ఎమ్మెల్సీ కవిత.. రాష్ట్రంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయించడంపై బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో కవితకు టికెటిస్తే రాష్ట్రంలోని 33 శాతం మహిళలకు టికెట్ ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి లేదని పరోక్షంగా విమర్శించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో 115 మంది అభ్యర్థుల పేర్లు ఉండగా.. అందులో సగం మందికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బీఫామ్ ఇవ్వరని బండి సంజయ్ చెప్పారు. పార్టీ కేడర్ ను కాపాడుకునే ఉద్దేశంతో విడుదల చేసిన జాబితా మాత్రమేనని స్పష్టం చేశారు.

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలలో బీఆర్ఎస్ కేవలం 25 సీట్లకే పరిమితం అవుతుందని తేలిందన్నారు. దీంతో పార్టీ కేడర్ ను, నేతలను కాపాడుకోవడానికి కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల్లో చాలామంది బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారని సంజయ్ తెలిపారు.


More Telugu News